Post: #1

అర్థమత్స్యేంద్రాసనము

ఈ ఆసనము మత్స్యేంద్రులు అనే యోగీశ్వరునిచే రూపొందించబడినది కావునా దీనిని అర్థమత్స్యేంద్రాసనము అంటారు.

చేయు విధానముః అర్థమత్స్యేంద్రాసనములో విడి విడిగా రెండు ప్రక్కలకు వక్రాసనములో మాదిరిగా చేయాలి.

కుడిప్రక్కకుః-


1. కూర్చుని రెండుకాళ్ళను పూర్తిగా చాపి చేతులను వీపు వెనకాల భాగాన నేలకు ఆనిస్తారు. తరువాత ఎడమ కాలిని మడిచి, రెండు పిఱలమధ్య మడమ వచ్చేటట్లు పెట్టి ఎడమ కాలి పాదంపై కూర్చుంటారు. ఆ తరువాత కుడికాలిని మడిచి పైకి లేపి ఎడమ కాలి తొడను దాటించి పాదమును నేలపై ఆనేలా పెట్టాలి.

2. ఇప్పుడు ఎడమ చేతిని కుడి కాలి మోకాలిపైనుండి తీసుకుని వచ్చి (వక్రాసనములో వేసినట్లు) ఎడమ మోకాలి చిప్ప భాగాన్ని పట్టుకుంటారు.

3. కుడికాలిని ఎడమ చేతి చంకభాగములోనికి వెళ్ళేటట్లు బాగానెట్టుకుంటూ నడుమును మెడను, కుడిప్రక్కకు త్రిప్పుతూ, కుడిచేతిని, నేలమీదనుండి తీసి నడుము భాగముపై పెట్టి, శరీరాన్ని ఎడమ కాలిమీద ఆపగలిగి అలా కదలకుండా నిలపగల్గాలి.

4. ఆసనాన్ని తీసివేద్దామనుకున్నప్పుడు ముందు వెనుక చేతిని ముందుకు తీసుకునివచ్చి, కళ్ళు మూసుకునే మెడను ముందుకు త్రిప్పి క్రమేపి మిగితా ఆసనాన్ని తీసివేయాలి.

ఎడమ ప్రక్కకుః


1. కూర్చుని రెండు కాళ్ళను పూర్తిగా చాపి, చేతులను వీపు వెనకాల భాగాన ఆనిస్తారు. తరువాత కుడి కాలిని మడిచి రెండు పిఱల మధ్య మడమ ఉండేటట్లు పెట్టి కుడి కాలి పాదము పై కూర్చుంటారు. తరువాత ఎడమ కాలిని మడిచి పైకి లేపి కుడి కాలి తొడను దాటించి ఆ ప్రక్క నుంచోబెడతారు.

2. ఇప్పుడు కుడి చేతిని ఎడమ కాలి మోకాలిపైనుండి తీసుకుని వచ్చి కుడి మోకాలి చిప్పభాగాన్ని పట్టుకుంటారు.

3. ఎడమ కాలిని కుడి చేయి చంకభాగములోనికి వెళ్ళేటట్లు కుడిచేతితో బాగా నెట్టుకుంటూ నడుమునూ మెడనూ పూర్తిగా ఎడమప్రక్కకు త్రిప్పుతూ ఎడమ చేతిని నేల మీద నుండి తీసి నడుము భాగము పై పెట్టి శరీరాన్ని కుడి కాలి మీద ఆపగలిగి అలా కదపకుండా నిలపగల్గాలి.

వేరొక పద్ధతిః   తొడలు బాగాలావు వున్నవారు, పొట్ట పెద్దదిగా వున్నవారు, ఈ ఆసనం వేయాలంటే శరీరము సహకరించదు.


ఎడమకాలిని మడిచి పిఱలక్రింద పెట్టకుండా అలా పిఱ ప్రక్క భాగానికి జరిపి, కుడి కాలిని మడిచి, ఎడమ కాలి మోకాలి భాగాన నుంచోబెట్టి, ఎడమ చేతితో కుడికాలును నెడుతూ ఎడమ చేతితో ఎడమ మోకాలి భాగాన్ని పట్టుకోవటం కష్టము కాబట్టి, అందినంతవరకు చేతిని పెట్టి ఎడమ చేతితో కుడి కాలిని నెడుతూ, నడుమునూ, మెడను, పూర్తిగా ప్రక్కకు త్రిప్పుతూ, కుడి చేయి నేలకు ఆనించివచ్చు లేదా నడుము పైభాగాన పెట్టుకోవచ్చు.

పై విధముగా రెండు ప్రక్కలా చేయాలి. అంటే ఎడమ ప్రక్క కూడా చేయాలి.

ఫలితాలుః


౧. తుంటి భాగములో కొవ్వు కరుగుతుంది.

౨. పొట్ట ప్రేగులకు మసాజ్ చేసినట్లు అయ్యి వాటికి లాభం కలుగుతుంది.

౩. పాంక్రియాస్ గ్రంధి బాగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది.

౪. భవిష్యత్తులో వయస్సు పెరిగినప్పటికి నడుముకు సంబంధించి ఇబ్బందులు రావు.

****నడుమునొప్పి వున్నవారు ఈ ఆసనము వేయరాదు*****


మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)