Post: #1

గృహస్థాశ్రమములో వున్న ప్రతి వ్యక్తి ఎటువంటి ధర్మాచరణను చేయాలి?

సవివరముగా తెలియపరచగలరు.

ముందస్తు ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post: #2

గృహస్థాశ్రమ ధర్మాలుః

మానవుడు మూడు కాలాలలోను ఆసనం పై కూర్చుని ప్రతిరోజూ తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకు అవకాశములేకపోతే ఉదయము, షోడశోపచార పూజ, మధ్యాహ్నము పంచోపచార పూజ, సాయంత్రము నీరాజనము అయినా సమర్పించాలి. అందుకొరకు ప్రతివారు తమయింట మంచి గంధము, నెయ్యి, జింక చర్మము వుంచుకోవాలి.

మానవ జన్మ లభించిన తరువాతకూడ భగవంతుని పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది. అటు తర్వాతకూడా మానవ జన్మ రావటము కష్టము.

అన్నింటిలోనికి గురుపూజ శ్రేష్ఠమైనది. అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగములో మానవులకు గురువుయందు భగవంతుడు అనే భావన కలగడము కష్టము. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించుట వలన సర్వ పాపాలు నశిస్తాయి.

అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రహ్మణుడు - వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు.

అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్ఠము. మధ్యములకు మండలములో పూజ, అథములకు విగ్రహారాధన  అవసరము. భక్తితో పూజించగల్గితే రాయి చెక్క కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు.

పీటమీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజాద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. తర్వాత, ఎదుట సింహాసనము మీద ఇష్టదేవతావిగ్రహము ఉంచి, దానికి కుడివైపున శంఖము, ఎడమవైపున గంట వుంచి, దేవుని మీదనున్న నిర్మాల్యము తొలగించి, దీపము వెలిగించాలి. మొదట గణపతిని పూజించి, గురువును స్మరించి, తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయములో భావించి, వారిని మన ఎదుట వున్న విగ్రహములోనికి ఆహ్వానించాలి, సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట వుండి మన పూజను గ్రహిస్తారని ధృడంగా గుర్తుంచుకోవాలి.

ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పూలు శ్రేష్ఠము,  పసుపు, ఎరుపు రంగు గల పూలు మధ్యమము, నల్లనివి మరియు ఇతర రంగు గల పూలు అధమము.

ఉదయమే "అపవిత్రః పవిత్రోవా" అనే శ్లోకము చదువుకొని గురువును, కులదైవమును స్మరించడము మానసిక స్నానము అంటారు.

అదేవిధముగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి, ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చేయాలి.

తల్లితండ్రులు, గురువులు, సద్బ్రహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి.

తల్లితండ్రులు, పూజ్యులు, పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి, వారి పాదాలకు నమస్కరించాలి.

గురువు యొక్క కుడి పాదాన్న్ని మన కుడి చేతితోను, ఎడమ పాదాన్ని ఎడమ చేతితోను స్పృశించి, సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి మోకాలినుండి పాదము వరకు స్పృశించాలి.

తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతితల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లితండ్రులయొక్క సోదరులు, జ్ణాన వృద్ధులు వీరందరికి గురువుతో సమానంగా నమస్కరించాలి.

అజ్ణానులు, తనకంటే చిన్నవారు, స్నానము చేస్తున్నవారు, సమిధలు మొదలగు పూజాద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధనగర్వులు, కోపించినవారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కరించకూడదు.

ఒక చేత్తో ఎప్పుడూ ఎవ్వరికీ నమస్కరించకూడదు.

ప్రతిరోజు వైశ్వదేవము చేయాలి. అతిధుల కులగోత్రాలను పట్టించుకోకుండా భగవత్స్వరూపులుగా తలచి భోజనము పెట్టాలి. కారణము వారు సాక్షాత్తు సద్గురు స్వరూపాలే.

అతిధి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనము పెడితే త్రిమూర్తులు, సంతోషిస్తారు.

అతిధికి, భిక్షకోసము వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము, నైవేద్యము అవకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి.

భోజనము వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి, దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి.

పతితుల పంక్తిన భోజనము చేయకూడదు.

మొదట కుడి ప్రక్క నేలమీద చిత్రగుప్తునికి బలిగా కొంచెము అన్నముంచిన తర్వాత భోజనము చేయాలి.  తనద్వారా భోజనము చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలేననే భావముతో భోజనము చేయాలి.

కుక్కను, రజస్వలను, ఎటువంటి ధర్మమును పాటించనివాడిని చూస్తూ భోజనము చేయకూడదు.

భోజనమయ్యాక అగస్త్యమహర్షిని, కుంభకర్ణుణ్ణి, బడబాగ్నిని స్మరిస్తే జీర్ణశక్తి అభివృద్ధి అవుతుంది.

సాయంకాలము పురాణాలు, సద్గ్రంధాలు పెద్దలద్వారా వినాలి.

సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి.

రాత్రి తేలికగా భోజనము చేసి కొంతసేపు సద్గ్రంధాలను చదువుకుని, తర్వాత తాను ఆరోజంతా చేసిన సత్కర్మలన్నీ భగవంతుని ప్రీతికోసము సమర్పించి నమస్కరించాలి.

ఉత్తరానికి తలపెట్టి నిద్రించకూడదు.

ఇవండీ గృహస్థాశ్రమ ధర్మాలు.

అర్ధమయ్యింది కదూ!!!!!!!!!!

ధన్యవాదములతో...

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)