Post: #1

అశ్వత్థ వృక్షము (రావిచెట్టు) యొక్క ప్రాశస్త్యము

 

అశ్వత్థవృక్షములో సర్వదేవతలు వుంటారు.

అశ్వత్థవృక్షమే నారాయణ స్వరూపము. ఆ వృక్షము యొక్క మూలమే బ్రహ్మ. దాని మధ్యభాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు.

ఇలాంటి ఈ అశ్వత్థ వృక్షమును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే.

త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు, తూర్పు దిక్కున వున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలుంటారు.  దాని వ్రేళ్ళలో మహర్షులు, గోబ్రాహ్మణులు, నాలుగు వేదాలు వుంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మలలో వుంటాయి.

ఆ చెట్టుయొక్క మూలంలో 'అ'కారము,  మానులో 'ఉ'కారము, దాని పండ్లు 'మ'కారము - ఆ వృక్షమంతా కలసి ప్రణవస్వరూపమే. కనుకనే అది సాక్షాత్తు కల్పవృక్షమే.

ఈ వృక్షమును సేవించు విధానముః

 అశ్వత్థ ప్రదక్షిణము చైత్ర, ఆషాఢ, పుష్యమాసాలలోనూ, గురు, శుక్ర మౌఢ్యాలలోను, కృష్ణపక్షములోనూ ప్రారంభించగూడదు.

 శుభ సుముహూర్తములో స్నానాదులు చేసుకుని శుచియై ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోను, సంక్రమణ సమయాలుమొదలగున నిషిద్ధ సమయాలలోను, రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్తుతి, పరనింద, జూదము,  అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానము చేసి వుతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగ యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థవృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకము చేయాలి. అప్పుడు మరల స్నానము చేసి, దేవతామయమైన ఆ వృక్షానికి పురుషసూక్త విధానముగా షోడచోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరము ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణుసహస్ర నామము చదువుతూ కాని, మౌనముగా కాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారము చేయాలి. ఇలా రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి, నాల్గు పురుషార్ధాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా  దానిపై దృష్టిని నిలిపి, బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షిణ చేస్తే తప్పక  కల్గుతారు.శనివారము నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రము జపిస్తే మృత్యుభయము తొలగుతుంది. ఈ వృక్షాన్ని పూజించాక -

శ్లో. కోణస్థః పింగళో బభ్రుః

కృష్ణోరౌద్రాంతకో యమః

శౌరిశ్శనైశ్వరో మందః

పిప్పలాదేవ సంస్తుతః

అనే మంత్రము ధృడవిశ్వాసముతో జపిస్తే శనిదోషాలు కూడా తొలగి, అభీష్టసిద్ధి కలుగుతుంది. గురువారము , అమావాస్య కలిసిన రోజున స్నానము చేస్తే పాపము నశిస్తుంది. అక్కడ వేదవిప్రునికి మృష్టాన్న భోజనము పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితము వుంటుంది. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపము వలన నాలుగు వేదాలు చదివిన ఫలితముంటుంది. రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాలవారికి స్వర్గము లభిస్తుంది.  దానిని కొట్టివేయడము మహా పాపము. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేసాక, ఆ సంఖ్యలో పదవ వంతు హోమము, అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి. ఈ వ్రతకాలములో బ్రహ్మచర్యమవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును, అలంకరించిన ఆవు-దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని, ఉదారమైన, దక్షిణలతో సౌశీల్యవంతులూ, కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా రావిచెట్టును పూజిస్తే తప్పక అభీష్టాలన్ని నెరవేరుతాయి.

ఇది బ్రహ్మాండపురాణాంతర్గత నారద వర్ణితము.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ... 


Post: #2
Nice article but give me a reason why should we do like that? please do not say according to purana. I just want a technical reason.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)